కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలి.. పలాసలో రైతు, ప్రజాసంఘాల ఆందోళన.


కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలి.. పలాసలో రైతు, ప్రజాసంఘాల ఆందోళన.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జులై 15 :

శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం పలాస ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ భూములు, సముద్ర తీర పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

'చలో ఆర్‌డీఓ కార్యాలయం' కార్యక్రమానికి పోలీసులు విధించిన ఆంక్షలను నాయకులు ఖండించారు. గ్రామాల నుంచి వస్తున్న రైతులు, ప్రజలను పలుచోట్ల అడ్డుకున్నప్పటికీ నిర్బంధాలను అధిగమించి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారని తెలిపారు. ఆర్‌డీఓ కార్యాలయంలోకి అనుమతి నిరాకరించడంతో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పలాస ప్రాంత అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కార్గో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు స్థానిక రైతులు, మత్స్యకారులు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆరోపించారు. నాలుగు పంటలు పండే సారవంతమైన భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల వేలాది కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాకు అవసరమైన సాగునీటి, వ్యవసాయ ప్రాజెక్టులు, రైతు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఆఫ్‌షోర్ రిజర్వాయర్, వంశధార నైవేద్యం ఛానల్, పెద్దవంక లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, జీడి, కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

ప్రజల ఆస్తులు, ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించిన నాయకులు, రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post