ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్.



 ప్రశ్న రావణ్‌పై యూఏపీఏ కేసు ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

శ్రీకాకుళం, జులై 7: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. నాగభూషణం, జిల్లా కార్యదర్శి సీహెచ్. రవికుమార్ మాట్లాడుతూ, ప్రశ్న రావణ్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో యూఏపీఏ వంటి కఠిన చట్టాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విమర్శలు చేయడం, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులని పేర్కొన్నారు.

యూఏపీఏ వంటి చట్టాలు అత్యంత తీవ్రమైన నేరాలకు మాత్రమే వర్తించాల్సి ఉండగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వ్యక్తులపై వాటిని అమలు చేయడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రశ్న రావణ్‌పై నమోదు చేసిన యూఏపీఏ కేసును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, చట్టాల అమలులో పారదర్శకత పాటించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌తో పాటు జిల్లా నాయకులు రాజు, సాయి, పవన్ కళ్యాణ్, కార్తీక్, కౌశిక్, హర్ష, విజయ్ మనోహర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post