నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి-డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -జి సూర్య కిరణ్.
జంగారెడ్డిగూడెం యువజన, విద్యార్థి, ప్రజా సంఘాల డిమాండ్.
జంగారెడ్డిగూడెం, జూలై 24, క్రైమ్ 9మీడియా ప్రతినిధి : నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని జంగారెడ్డిగూడెం యువజన, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జగజీవన్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి. సూర్యకిరణ్ మాట్లాడుతూ, దేశంలో పరీక్షల నిర్వహణలో తీవ్ర వైఫల్యం చోటుచేసుకుందని, నీట్ పేపర్ లీకేజీ వల్ల కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసినా, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.
అలాగే ఆయన ఈ క్రింది డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు:
నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరపాలి.
పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, భద్రతను పూర్తిగా పటిష్టం చేయాలి.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి.
విద్యను ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ చేసే విధానాలను ఉపసంహరించుకోవాలి.
దేశవ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం జరిగేలా పారదర్శక పరీక్షా విధానాన్ని అమలు చేయాలి.
ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు చల్లారి మాణిక్యాలరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు మాబు, సుభాని, వెంకటరాజు, కే. సుబ్బారావు, నాని, ఆశీర్వాదం తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
