విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం కీలకం: ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన
వజ్రపుకొత్తూరు, జూలై 24: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష అన్నారు.
వజ్రపుకొత్తూరు మండలంలోని నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, పిల్లల చదువు, క్రమశిక్షణ, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి తమ కుటుంబానికి, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమైన ఎమ్మెల్యే, పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అవసరాలపై చర్చించి వారి సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, వజ్రపుకొత్తూరు మండల కూటమి అధ్యక్షులు, కార్యదర్శులు, పీఏసీఎస్ చైర్మన్, ఎంపీడీవో, ఎంఈఓ, వెటర్నరీ వైద్యాధికారి, మండల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

