హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం: సీదిరి అప్పలరాజు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
వజ్రపుకొత్తూరు, జూన్ 6:
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన "సూపర్ సిక్స్", "సూపర్ సెవెన్" హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో భాగంగా వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో నిర్వహించిన భారీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి వంటి కీలక హామీలు ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. అధికారంలోకి రావడానికి ప్రజలను నమ్మించి, గెలిచిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
డీఎస్సీ నియామకాల అంశంపై స్పందిస్తూ, ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రక్రియ పారదర్శకంగా లేదని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్‌ను చేర్చడం వంటి నిర్ణయాలు యువతలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గ–వజ్రపుకొత్తూరు డబుల్ రోడ్డు, నువ్వలరేవు–టెక్కలిపట్నం రహదారి వంటి ప్రధాన ప్రాజెక్టులు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని, ప్రస్తుతం వాటిని తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
మద్యం దుకాణాల్లో జరుగుతున్న అదనపు వసూళ్లపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఆర్‌పీకి మించి ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ వసూళ్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు సమీకరించబడుతున్నాయని ఆరోపించారు.
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం సాగిస్తోందని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
