కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో ఉద్దానం విధ్వంసం చేయొద్దు: వామపక్ష నేతలు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
మందస: ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో ఉద్దానం ప్రాంతంలోని సస్యశ్యామల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు డిమాండ్ చేశారు.
మందస మండలం ఎం. గంగువాడ సమీపంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వామపక్ష నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పలాసలో విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఉద్దానం ప్రాంతం జిల్లాలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములతో కూడిన ప్రాంతమని, ఇక్కడ ఏటా అనేక పంటలు పండుతాయని పేర్కొన్నారు.
కార్గో ఎయిర్‌పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం అభివృద్ధి కాదని, ప్రజల జీవనాధారాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. ప్రకృతి సంపద, ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వాలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.
ఉద్దానం ప్రాంతంలోని లక్షలాది వృక్షాలు, పచ్చదనం తీర ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షిస్తున్నాయని, ఇలాంటి ప్రాంతంలో భారీ స్థాయిలో భూసేకరణ చేపడితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, మూలపేట పోర్టు కోసం కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని ఇందుకు వినియోగించవచ్చని సూచించారు.
దేశంలో ప్రత్యేకంగా కార్గో ఎయిర్‌పోర్ట్‌లు చాలా అరుదుగా ఉన్న నేపథ్యంలో, ఉద్దానం ప్రాంతాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.
అలాగే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల సమయంలో జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రతిపాదిత కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని, ఉద్యమాలపై పోలీసు నిర్బంధం, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి, న్యూ డెమోక్రసీ నాయకుడు జుత్తు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

