క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలంలో ఐటీడీఏ నిధులతో రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు బీటీ రోడ్లను ఆమె గురువారం ప్రారంభించారు.
అంబుగం గ్రామంలో ఓల్డ్ ఎన్‌హెచ్-5 నుంచి నోతువారా గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డుతో పాటు, హంసరాలి పంచాయతీ పరిధిలోని మందవూరు గ్రామం వద్ద ఎంఎం రోడ్ నుంచి కిలోయి డబార్సింగ్ వరకు మందవూరు మీదుగా నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన గ్రామాల అభివృద్ధి, గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఐటీడీఏ ద్వారా ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నూతన రోడ్లతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరమవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ అవసరాల కోసం ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని పేర్కొన్నారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
