కొత్తూరులో పోలీసుల అవగాహన సదస్సు.



 కొత్తూరులో పోలీసుల అవగాహన సదస్సు.

సైబర్ నేరాలు, మహిళా భద్రత, కొత్త చట్టాలపై గ్రామస్తులకు అవగాహన.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, జూన్ 24: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు కాశీబుగ్గ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్. నరసింహమూర్తి ఆధ్వర్యంలో పలాస మండలం కొత్తూరు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన ఎస్సై, మహిళా సాధికారత (నారీ శక్తి), కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన చట్టాలు, ప్రజల హక్కులు మరియు బాధ్యతలపై వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

గ్రామంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో నిర్వహించే పండుగలు, జాతరలు, ఉత్సవాలు లేదా ఇతర సామూహిక కార్యక్రమాల గురించి ముందస్తుగా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని గ్రామస్తులకు తెలియజేశారు.

అదేవిధంగా ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చినా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.

అక్రమ గంజాయి, నాటుసారా తయారీ మరియు రవాణా, పేకాట, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, గృహహింస, బాలల రక్షణ చట్టాలపై కూడా అవగాహన కల్పించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 అత్యవసర సేవలను వినియోగించాలని, ప్రజలు పోలీసులకు సహకరించి నేరరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఎస్సై నరసింహమూర్తి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post