కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన ఎంపీ పొట్ట మహేష్ సమావేశం.



 కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన ఎంపీ పొట్ట మహేష్ సమావేశం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

        ఏలూరు, జూన్, 24 :  ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనం పెరగాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ, ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత సమస్యలపై ఎంపీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాల స్థాయి ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వద్దకు వచ్చిన ప్రజల అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరుగుతున్నదని, వాటిపై కొన్ని శాఖల అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడమే కాకుండా కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదని, ఇది చాలా విచారించదగిన విషయమన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాలలో నిరక్షరాస్యులు, పేదలకు ఎటువంటి సేవలందుతున్నాయో ఊహించుకోవచ్చన్నారు. ఇకనుండి ఇటువంటి పద్ధతి ఖచ్చితంగా మారాలని, ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. అధికారులు ఆ దిశగా పనిచేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రజల సమస్యలపై అధికారులు, సిబ్బంది బాధ్యతతో స్పందించి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనల సమయంలో ఎయిర్పోర్ట్ మాదిరిగా ఆధునీకరిస్తామంటూ చూపించిన 3డి చిత్రాలకు, ప్రస్తుతం జరుగుతున్న పనులకు అసలు సంబందం లేదన్నారు. మొదటి దశలో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నాసిరకం మెటీరియల్ వినియోగించారని , ఎయిర్పోర్ట్ లాగా కాదు ఒక గెస్ట్ హౌస్ మాదిరిగా మాత్రమే ఉందన్నారు. బుకింగ్ కౌంటర్లు, వసతి, ప్రయాణీకుల విశ్రాంతి గదులు, టాయిలెట్లు, వంటి వాటిని అస్సలు పట్టించుకోలేదని, పాత వాటినే తూతూ మంత్రంగా మెరుగులు దిద్ది కొనసాగిస్తున్నారన్నారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలకు సరిపోయే విధంగా ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఉండేలా చేపట్టాలని, అవసరమైతే ప్రతిపాదనలు సవరించి సమర్పించి, పనులు పూర్తి నాణ్యతతో చేపట్టి, కొత్త స్టేషన్ మాదిరిగా రూపొందించాలన్నారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సక్రమంగా చేపట్టకపోతే విజిలెన్స్ విచారణ చేయిస్తానని ఎంపీ హెచ్చరించారు. జిల్లాలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణ పనులు 6 నెలల నుండి ఎటువంటి పురోగతి లేదని రైల్వే అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో సమన్వయము చేసుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని రైల్వే అధికారులను ఎంపీ ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనులు ఏ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన పనులను అదే సంవత్సరంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా శాఖాధికారులను ఎంపీ ఆదేశించారు.

      గోదావరి పుష్కరాలకు జిల్లాలో రహదారి భవనాల శాఖ ద్వారా 314 కోట్ల రూపాయలతో 72 పనులకు ప్రతిపాదనలు సమర్పించామని, అదేవిధంగా 274 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం, మరమ్మత్తులకు 193 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సమర్పించామని అధికారులు తెలియజేయగా గోదావరి పుష్కరాలకు పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాలలో నిర్మించాల్సిన రోడ్ల నిర్మాణ పనులకు త్వరితగతిన మంజూరు తీసుకుని పనులు ప్రారంభించాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి కైకలూరు బైపాస్ రోడ్డు పనులు డిసెంబర్ లోగా పూర్తిఅయ్యేలా చూడాలన్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ల్యాబ్ ను జంగారెడ్డిగూడెం తరలించకుండా ఏలూరు ఆసుపత్రిలోనే కొనసాగించాలని, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ పరికరాల మంజూరు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలందించేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ఏలూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉంగుటూరు, కైకలూరు, తదితర మండలాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఏలూరులో బిసి వసతి గృహం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఉపాధి హామీ పధకంలో కోరిన వారికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలన్నారు.

               జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు నుండి అందిన ప్రతిపాదనలకు ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని పరిశ్రమల నుండి కార్పొరేట్ సామజిక బాధ్యత నిధుల నుండి పలు కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ కి తెలియజేసారు. 

              నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, డిపిఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post