కళింగపట్నం వరకు విస్తరించిన రుతుపవనాలు. ఏపీకి తుపాను గండం!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.
వీటి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రను ఆనుకుని 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడ్డాయి. వీటికి తోడు అరేబియా సముద్రం నుండి దక్షిణ కొంకణ్, కర్ణాటక, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాగల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
నేడు ఆరు జిల్లాలకు 'ఎల్లో అలెర్ట్' జారీ
రాష్ట్రవ్యాప్తంగా గురువారం (జూన్ 11) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ కేంద్రం 'ఎల్లో అలెర్ట్' జారీ చేసింది. ప్రజలు, రైతులు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
