పలాస-కాశీబుగ్గలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు.
పలాస-కాశీబుగ్గ పట్టణంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ముందుగా స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.
అనంతరం పలాస అన్నా క్యాంటీన్‌లో సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమాని తాళ్లభద్ర బాబురావు మాట్లాడుతూ, “మా అభిమాన నటుడు బాలకృష్ణ జన్మదినం మాకు పండుగలాంటి రోజు. సినీ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేద రోగులకు వైద్య సేవలు అందించి వారి జీవితాల్లో ఆశాజ్యోతిగా నిలిచారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తూనే, మరోవైపు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న బాలయ్య మరెన్నో జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీసీ చైర్మన్ బాబురావుతో పాటు పెద్ద సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

