ఎమ్మెల్యేను ప్రశ్నించే స్థాయి నీది కాదు - వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస: పలాస నియోజకవర్గ రాజకీయాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పలాస జిల్లాగా ఏర్పాటు అంశంపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
జిల్లాల పునర్విభజన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు అప్పట్లో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పలాస జిల్లా అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన ఆరోపించారు.
మత్స్యకారుడు మువ్వల నాగేష్ మృతి ఘటనపై అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని, ఈ ఘటనపై పూర్తి నిజాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
అలాగే పలాసలో మద్యం విక్రయాలపై అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. మద్యం విక్రయాలపై అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, అక్రమాలు జరిగితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
పలాస PACS, గోల్డెన్ ల్యాండ్ భూముల వ్యవహారం, ఉజ్జిడి మెట్ట ఘటనలు, ఆస్తుల వివరాలు, మైనింగ్ కార్యకలాపాలపై కూడా పలు ప్రశ్నలు లేవనెత్తిన వజ్జ బాబూరావు, వాటిపై విచారణ జరిగితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. మైనింగ్ లీజుల పరిమితులు, నిబంధనల అమలుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
తనపై లేదా ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం కంటే వాస్తవాలతో మాట్లాడాలని సూచిస్తూ వజ్జ బాబూరావు తన వ్యాఖ్యలను ముగించారు.
