సిల్లంగి మూఢనమ్మకాలపై పోలీసుల అవగాహన సదస్సు
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన
పలాస మండలం, లోత్తూరు, జూన్ 24: సమాజంలో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలను నిర్మూలించి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కాశీబుగ్గ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం లోత్తూరు గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ టౌన్ సీఐ వై. రామకృష్ణ, ఎస్సై ఎన్. సునీల్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన అధికారులు సిల్లంగి వంటి మూఢనమ్మకాలను విశ్వసించి అపోహలకు గురికావద్దని సూచించారు. అనారోగ్య సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తినప్పుడు వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా సరైన పరిష్కారం పొందవచ్చని తెలిపారు. శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవరచుకోవడం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
అనంతరం గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సచివాలయ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శికి సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మహిళల భద్రత, చిన్నారుల సంరక్షణ, సైబర్ నేరాల నివారణ, పౌరుల హక్కులు, బాధ్యతలపై వివరించారు. అనుమానాస్పద ఘటనలు, నేరాలు లేదా సామాజిక సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
