భార్య ను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 37/2026 కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు పంధీటి దావీదును పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, గిద్దలూరు మండలంలోని ఏబీఎం పాలెంకు చెందిన పంధీటి దావీదు (40) తన భార్య పంధీటి మరియ జ్యోతిపై అనుమానం పెంచుకుని తరచూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మరియ జ్యోతి సుమారు మూడు సంవత్సరాల క్రితం తన పిల్లలతో కలిసి కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లి గ్రామంలోని తన తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటోంది.
ఈ నేపథ్యంలో జూన్ 10వ తేదీ ఉదయం సర్వేరెడ్డిపల్లి గ్రామానికి వచ్చిన దావీదు, తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో మరియ జ్యోతిపై దాడి చేశాడు. ఆమె చెల్లెలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, మరియ జ్యోతిని వెంబడించి విచక్షణారహితంగా నరికి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఘటన అనంతరం నిందితుడు హత్యకు ఉపయోగించిన గొడ్డలి మరియు రక్తపు మరకలు ఉన్న దుస్తులను తాతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని పొదల్లో దాచిపెట్టి పరారయ్యాడు.
పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి, జూన్ 12వ తేదీ ఉదయం కొమరోలు మండలం తాటిచెర్ల మోటు జంక్షన్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని చూపిన ప్రదేశంలో నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
హత్య జరిగిన కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన గిద్దలూరు రూరల్ సీఐ జే. రామకోటయ్య, కొమరోలు ఎస్‌ఐ మరియు వారి సిబ్బందిని మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు..
