నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించిన కాశీబుగ్గ పోలీసులు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 18: మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని పలు కూడళ్లలో కాశీబుగ్గ పోలీసులు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు, యువతతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. యువత ఏ దేశానికైనా ప్రధాన శక్తి అని, దేశ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని పేర్కొంటూ గంజాయి, మాదకద్రవ్యాలు వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం కొంతమంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన సీఐ, "మార్పు మనతోనే ప్రారంభం కావాలి" అనే సందేశంతో ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటమే కాకుండా సమాజాన్ని కూడా ఆ దిశగా నడిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా "నా దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు నా శక్తి మేరకు కృషి చేస్తాను" అంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

