రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
టెక్కలిపట్నంలో రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమం
పలాస మండలం టెక్కలిపట్నంలో రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
అధికంగా రసాయన ఎరువుల వినియోగం వల్ల భూమి సారవంతత తగ్గే ప్రమాదం ఉందని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు మాత్రమే ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. భవిష్యత్ తరాల కోసం భూమి ఆరోగ్యాన్ని కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు తదితర ప్రయోజనాలు పారదర్శకంగా పొందేందుకు రైతులు ప్రభుత్వ యాప్‌లో నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీను, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు వంకల కుర్మారావు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, రైతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

