భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించిన పలాస ప్రజలు.
ప్రతిపాదిత పలాస విమానాశ్రయంపై అవగాహన కల్పించేందుకే పర్యటన.
ప్రజలు, రైతులు, విద్యార్థులతో కలిసి భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్.
భోగాపురం,( శ్రీకాకుళం ) ఆగస్టు 12 :
పలాస నియోజకవర్గంలో ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలపై ప్రజలు, రైతులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో బుధవారం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.
జిల్లా కలెక్టర్ సప్నికల్ దినకర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో పలాస ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతానికి చెందిన ప్రజలు, రైతులు, విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు, అక్కడ ఏర్పాటు చేస్తున్న ఆధునిక మౌలిక వసతులను వారు ప్రత్యక్షంగా చూశారు.
విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన అనంతరం పరిసర ప్రాంతాల్లో ఏర్పడే ఉపాధి, వ్యాపార, రవాణా, విద్యా, పర్యాటక, ఆర్థిక అవకాశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి వివరించారు. ముఖ్యంగా విమానాశ్రయం ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు మార్కెట్ అనుసంధానం మెరుగుపడే అవకాశం ఉంటుందని తెలిపారు.
అభివృద్ధికి కొత్త ఊతం
పలాస నియోజకవర్గంలో ప్రతిపాదిత విమానాశ్రయం సాకారం అయితే ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. విమానాశ్రయం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు మరింత సులభతరం అవుతాయని వివరించారు.
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విమానాశ్రయ నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది, ఆధునిక మౌలిక వసతులు ఎలా ఉంటాయి, వాటి వల్ల ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలను తెలుసుకునే అవకాశం లభించిందని పలాస ప్రాంత ప్రజలు, రైతులు, విద్యార్థులు తెలిపారు.
*త్వరితగతిన కార్యరూపం దాల్చాలని ఆకాంక్ష*
పలాస ప్రాంత అభివృద్ధికి ప్రతిపాదిత విమానాశ్రయం కీలకంగా మారుతుందని ప్రజలు పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రతిపాదన త్వరితగతిన కార్యరూపం దాల్చి నియోజకవర్గంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు మరింత వేగం తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పలాస నియోజకవర్గానికి చెందిన ప్రజలు, రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


