రూ.80 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం.
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు – పలు కేసుల ఛేదన.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
శ్రీకాకుళం, జూన్ 1: శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల నమోదైన వరుస దొంగతనాల కేసులను కాశీబుగ్గ పోలీసులు ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సోమవారం వెల్లడించారు.
అరెస్టు చేసిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాకు చెందిన మహమ్మద్ మీజాన్ (36), మహమ్మద్ హసన్ (26)గా గుర్తించారు. ప్రధాన నిందితుడు మీజాన్ పగటి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది.
నిందితుడు మీజాన్‌పై గతంలో శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. జైలు శిక్ష అనుభవించి విడుదలైన అనంతరం ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఉంటూ మళ్లీ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
గత మూడు నుంచి నాలుగు నెలల కాలంలో కాశీబుగ్గలో మూడు, టెక్కలిలో ఒకటి, పార్వతీపురం మరియు ఒడిశాలోని బరంపురం ప్రాంతాల్లో ఒక్కో చోరీ కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పలాస మండలం గరుడఖండి గ్రామంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.09 లక్షల నగదు, రూ.1 లక్ష విలువైన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన కాశీబుగ్గ పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

