పలాస లో కొత్త రైల్వే జోన్ సంబరాలు.


పలాస లో కొత్త రైల్వే జోన్ సంబరాలు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

ఈశాన్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయంగా నిలిచే దక్షిణకోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ కీలక పరిణామంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

ఇప్పటివరకు తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా డివిజన్ కింద కొనసాగిన ఇచ్చాపురం, పలాసతో పాటు పలు ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్లు నేటి నుంచి విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ఎమ్మెల్యే బెందాలం అశోక్‌తో కలిసి ఆవిష్కరించారు.

అనంతరం పలాస రైల్వే స్టేషన్‌లో నూతన డివిజన్ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేసి రైల్వే సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ప్రాంగణం సంబరాలతో కళకళలాడింది.

అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ముఖ్యంగా పలాస, ఇచ్చాపురం ప్రాంతాల్లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలాస నుంచి దేశంలోని పలు సుదూర ప్రాంతాలకు కొత్త రైలు సర్వీసులను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం రెండు లైన్లతో మాత్రమే కొనసాగుతున్న పలాస రైల్వే స్టేషన్‌లో అదనంగా మరో రెండు లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు భవిష్యత్తులో పలాస స్టేషన్ కీలక రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన దక్షిణకోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

దక్షిణకోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. పలాస అభివృద్ధికి కొత్త దిశ

పలాస స్టేషన్‌కు మరో రెండు లైన్లు – కొత్త రైళ్ల హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post