ఎచ్చెర్ల నియోజకవర్గంలో మహానాడు ఏర్పాట్లపై సమీక్ష.
రణస్థలంలో పర్యటించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ మహానాడు పరిశీలకులుగా నియమితులైన ఏపీటీపీసీ చైర్మన్ & తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు నేడు రణస్థలం మండలంలో విస్తృతంగా పర్యటించారు. మహానాడు కార్యక్రమం విజయవంతం కావడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, కార్యకర్తల భాగస్వామ్యం తదితర అంశాలపై నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ, మహానాడు తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ వంటిదని, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే గొప్ప వేదిక అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మహానాడు విజయవంతం కోసం కృషి చేస్తున్నారని, ఎచ్చెర్ల నియోజకవర్గం కూడా ఆదర్శవంతంగా మహానాడు నిర్వహణలో నిలవాలని ఆకాంక్షించారు.
రణస్థలం మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, మహానాడు కార్యక్రమానికి భారీగా ప్రజలను, అభిమానులను తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి పార్టీ శక్తిని సమీకరించి, ప్రతి కార్యకర్త మహానాడు విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇంధన సమస్యల వలన ఈ సారి మహానాడు డిజిటల్ విధానంలో జరపడానికి నిర్ణయం తీసుకున్న తరుణంలో నియోజకవర్గం పరిధిలోని 10 క్లస్టర్ల పరిధిలో కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుని మహానాడు విజయవంతం చేయాలన్నారు.
అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అభినందించిన వజ్జ బాబూరావు గారు, పార్టీ కోసం నిరంతరం పనిచేసే ప్రతి ఒక్కరికి నాయకత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రణస్థలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లంక శ్యామ్, కలిశెట్టి సూర్యనారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, కార్యాచరణ ప్రణాళికలపై నాయకులు చర్చించారు.

