ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం.


 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యం.

 సమష్టి కృషితో విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలి డీఈవో సామా సుబ్బారావు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కంభం,విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది సమష్టిగా పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) సామా సుబ్బారావు పిలుపునిచ్చారు.

శుక్రవారం స్థానిక వాసవి విద్యా సంస్థల సమావేశ మందిరంలో అర్థవీడు, బెస్తవారిపేట, కంభం, తర్లుబాడు మండలాల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంపు, డ్రాపౌట్‌ వివరాలు, నూతన అడ్మిషన్ల నమోదు వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు చేరేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు.

వృత్తి నిర్వహణలో చిత్తశుద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి అవసరమని ఆయన స్పష్టం చేశారు. బృందాలుగా ఏర్పడి సమయపాలనతో పనులను పూర్తి చేస్తే విద్యా రంగంలో విశిష్ట ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యార్థుల హాజరు, అభ్యాస నైపుణ్యాలు, పాఠశాల మౌలిక వసతులు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మండలాల వారీగా మొత్తం విద్యార్థుల సంఖ్య, తరగతి మార్పులు, ట్రాన్సిషన్ శాతం, నూతన అడ్మిషన్లు, డ్రాపౌట్ వివరాలను సమీక్షించిన డీఈవో, మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులను అభినందించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళికలతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంఈవోలు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, మండల సమన్వయకర్తలు, డేటా ఆపరేటర్లు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post