ఒంగోలులో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర సమీపంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన రవిప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ
రూ.100 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మాణం
పలు ప్రోత్సాహకాలు ఇవ్వనన్న ప్రభుత్వం
వేగంగా విస్తరిస్తున్న ఒంగోలు నగరంలో ఆతిథ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే నిర్మాణరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ తాజాగా నగర సమీపంలోని చదలవాడలో సుమారు 100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు రవి ప్రియ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలకు మార్చి 28న నిర్వహించిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో అనుమతి లభించింది. పలు ప్రోత్సాహకాలు అందించాలని పర్యాటక శాఖకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో దీనికి రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 కింద పలు రాయితీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హోటల్ నిర్మాణానికి మూలనిధి పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు, తదితర అంశాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ హోటల్‌లో 300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సంస్థ చైర్మన్ కంది రవిశంకర్ శుక్రవారం జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
