మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి.
మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
