అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు చర్యలు.



అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు చర్యలు.

- డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ వ్యవస్థను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, మార్చి 6: రాష్ట్రంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పశుసంవర్ధక శాఖ కీలక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో పశువుల రవాణా సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ జనరేషన్ సిస్టమ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా పశువుల రవాణా మరింత పారదర్శకంగా, నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇకపై పశువులను రవాణా చేయదలిచిన ప్రతి వ్యక్తి సంబంధిత పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ పొందిన తర్వాత మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్టిఫికెట్‌ను పశువుల రవాణా నిబంధనలకు అనుగుణంగా జారీ చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు. రవాణా, పోలీస్ శాఖలు ఈ డిజిటల్ సర్టిఫికెట్‌ను పరిశీలించిన అనంతరం మాత్రమే పశువుల రవాణాకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విధానం అమలులోకి రావడంతో పశువుల అక్రమ రవాణాపై సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుందని, అలాగే పశుసంవర్ధక రంగంలో పారదర్శకత, బాధ్యత పెరుగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post