ధాన్యం సేకరణ మద్దతు ధర పై విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో ఈనెల 16వ తేదీ వరకు 212 మంది రైతుల నుండి రూ.3.99 కోట్ల విలువగల 1779.6 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ చెప్పారు. మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా ధాన్యం సేకరణ తీరు, సాధిస్తున్న పురోగతిని ఆయన వివరించారు. ఇప్పటివరకు రూ.3.98 కోట్లను 211 మంది రైతులకు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన డబ్బులను తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్ నందు జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సాగును దృష్టిలో పెట్టుకుని రైతుల వద్ద నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో కూడిన ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. గోనెసంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు అందించినట్లు తెలిపారు.
ధాన్యాన్ని విక్రయించడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబరు 8008901457 ను సంప్రదించవచ్చని జాయింట్ కలెక్టర్ చెప్పారు. వాట్సాప్ 7337359375లోనూ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల మేరకు 24 గంటల లోపు నాణ్యతకు తగ్గ మద్దతు ధరను రైతులు పొందవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో 45 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
