గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష — ₹5,000/- జరిమానా: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి(మాకవరపాలెం), డిసెంబర్ :10
మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదు చేసిన గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులు గోవిందరాజ్ సెల్వరాజ్ మరియు రాజమణి లకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి 5,000/- జరిమానా విధిస్తూ, జరిమానా చెల్లించనట్లయితే అదనంగా 2 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం 1వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటనారాయణ ఈ రోజు తీర్పు వెలువరించారు.
కేసు నేపథ్యం:
2023 మే 18వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో, అప్పటి మాకవరపాలెం ఎస్సై పి.రామకృష్ణకి అందిన పక్కా సమాచారం మేరకు కొండల అగ్రహారం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సీపట్నం వైపు నుండి వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేస్తుండగా, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద ఉన్న లగేజీ బ్యాగులను తనిఖీ చేయగా, అందులో మొత్తం 18 కేజీల గంజాయి లభించింది. నిందితులు ఆటో బాలా (A-1) అనే వ్యక్తి సూచన మేరకు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడు తరలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు.
దర్యాప్తు:
ఈ కేసులో నిందితులను అప్పటి ఎస్సై పి.రామకృష్ణ అరెస్ట్ చేయగా, తదుపరి ఎస్సై డి.దామోదర నాయుడు సమగ్ర దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో అభియోగపత్రం (Charge Sheet) దాఖలు చేశారు.
కోర్టు విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.ఎస్.ఎన్.వి.ప్రసాద్ రావు బలమైన వాదనలు వినిపించగా, సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు పై శిక్షలను ఖరారు చేసింది.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ తీర్పును అనకాపల్లి పోలీసుల సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా అభివర్ణించారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్సై డి.దామోదర నాయుడు, అరెస్ట్ చేసిన ఎస్సై పి.రామకృష్ణ, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మాకవరపాలెం పోలీస్ సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సెల్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
