ఎస్సీ బాలుర వసతి గృహంపై వివక్షత ఎందుకు.?-ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్.
- తక్షణమే వసతి గృహ సమస్యలను పరిష్కరించాలి : -ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్.
ఏలూరు. క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
విద్యను అభ్యసించడానికి గ్రామాల నుండి వస్తున్న ఎస్సీ విద్యార్థుల వసతి గృహంపై అధికారులు వివక్షత చూపించడం సరికాదని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఏలూరులోని సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తుంటే ఆ వసతి గృహంలో సమస్యలు విళయతాండవం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం వద్ద గల ఎస్సి కళాశాల బాలుర వసతి గృహాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ తన బృందంతో కలిసి సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసిన శివకుమార్ అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం స్వయంగా డ్రైనేజీలో దిగి మరుగును పరిశుభ్ర పరచడమే కాకుండా డ్రైనేజీలో ఉన్న మద్యం బాటిల్లను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో ఉంటున్న అనేక మంది విద్యార్థులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వసతి గృహంలో భోజన సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని విద్యార్థులు పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల హాస్టల్లోకి ప్రతినిత్యం స్థానికేతరులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా మరుగునీరు పారుదలలేక విద్యార్థులు అనారోగాల భారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాత్రి సమయంలో వసతి గృహంలోకి ఇతరులు ప్రవేశించి మద్యం సేవించి వసతి గృహ ఆవరణలోనే మద్యం బాటిల్లను పారవేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల వసతి గృహ విద్యార్థులు తప్పుడు మార్గంలో పయనించే అవకాశం ఉందని శివకుమార్ అభిప్రాయపడ్డారు. ఇవన్నీ హాస్టల్ వార్డెన్ కి తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రశ్నించే వారిపై అసభ్య పదజాలంతో దూషించడం అతని పనితీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఎస్సీ బాలుర కళాశాల వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో విద్యార్థులతో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని శివకుమార్ హెచ్చరించారు.
