వెలిగొండ పనులపై తీవ్ర అసంతృప్తి.



 వెలిగొండ పనులపై తీవ్ర అసంతృప్తి.

గడువు లోగా పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవు.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

అధికారులను,ఏజెన్సీలను హెచ్చరించిన మంత్రి నిమ్మల.

 ప్రకాశం జిల్లా దోర్నాల పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ను వారం రోజుల వ్యవధిలోనే రెండో సారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  

ఇటీవలే మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్, పడిన గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలసి మంత్రి నిమ్మల బుధవారం పరిశీలించారు. తను వచ్చి వారం రోజులైనా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన డివాటరింగ్ పనులు, గండ్లు పూడ్చివేత పూర్తి కాకపోవటంతో 'ఇలా అయితే ఎలా అంటూ ' అసహనం వ్యక్తం చేశారు. 

అత్యంత వెనుకబడిన, ఫ్లోరైడ్ బాధిత ప్రకాశం జిల్లా ప్రజలకు న్యాయం చేయాలంటే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చిరకాల స్వప్నం అన్నారు. 

1996లో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు భూమి పూజ జరిగిందన్నారు. 

మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం పట్ల ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన చెందారన్నారు.

 కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన ఈ ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 2026 లో ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు అన్నారు.

 ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా..ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీలకి, పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులకు స్పందన లేకపోతే ఎలా అని జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన గత ప్రభుత్వం మాదిరి ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదు అన్నారు.. మొద్దు నిద్ర వీడనాడాలన్నారు.

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఫీడర్ కెనాల్ మొత్తం 19వేల మీటర్ల పొడవులో 12 వేల మీటర్ల పొడవు లైనింగ్ పూర్తయింది అన్నారు. మిగిలిన ఏడు వేల మీటర్ల లైనింగ్ పూర్తి కి నెలకు 600 మీటర్లు వంతున చేస్తే గాని నిర్దేశిత గడువు 2026 కల్లా పూర్తి కాదన్నారు. అలాగే జంట సొరంగాలలో లైనింగు, బెంచింగ్ తదితర అన్ని పనులు ప్రారంభించేందుకు, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు. 

రూ. 456 కోట్లతో చేపట్టే ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఈ నెలలోనే ప్రారంభించి, వచ్చే సీజనకు పూర్తి చేయమని నొక్కి చెప్పారు. ఈ పనుల విషయంలో ఎట్టి అశ్రద్ధ చేసినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2026 చివరి కల్లా వెలిగొండ పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నేను నిరంతరం పర్యవేక్షణ చేస్తానన్నారు. బాధ్యత గల ప్రభుత్వం, జవాబుదారీతనం గల ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వంలో.. మనందరం ఉండటం గర్వకారణంగా భావించాలని నిర్మాణ ఏజెన్సీకి, అధికారులకు హితవు పలికారు. వెలిగొండ మనందరి హయాములో పూర్తయితే ప్రకాశం జిల్లా ప్రజలకు మనం ఎంతో మేలు చేసిన సంతృప్తి ఎల్లవేళలా ఉంటుందనని రామానాయుడు తెలిపారు.

ఈ కార్యక్రమం లో మార్కాపురం శాసనసభ్యులు. కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు. ముత్తుముల.అశోక్ రెడ్డి, యర్రగొండ పాలెం, టీడీపీ ఇంచార్జ్ ఏరిక్షన్ బాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సిఈ శ్యాం ప్రసాద్, ఎస్ఈ అబుతాలేం మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post