రూ.6.90 కోట్లతో 20 కమ్యూనిటీ హాళ్లు.
అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మాణాలు.
యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి పోరాటం.
కొప్పెరపాడులో బీసీ కమ్యూనిటీ హాలు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి.
అద్దంకి:ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, అన్ని వర్గాల వారికీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం, జే.పంగలూరు మండలంలోని టి.కొప్పెరపాడు గ్రామంలో నిర్మాణం పూర్తయిన బీసీ వడ్డెర కమ్యూనిటీ హాలును, గోకులం షెడ్డును ఆదివారం నాడు మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.6.90 కోట్ల వ్యయంతో 20 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో తొలుతగా నిర్మాణం పూర్తి చేసుకున్న వడ్డెర కమ్యూనిటీ హాలును అతి తక్కువ సమయంలో నాణ్యతగా నిర్మించారని కితాబునిచ్చారు. కమ్యూనిటీ హాళ్లను వివిధ కార్పొరేట్ సంస్థలతో పాటు పరిశ్రమల యాజమాన్యాలు, దాతలు తమ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ముందకు వస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొప్పెరపాడు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి విద్యుత్ సంస్థల నుంచి రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులను అందజేసిందని విషయాన్ని మంత్రి గొట్టిపాటి వివరించారు.
ఊరిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. ఊరి బయట నిర్మిస్తే ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు. జే.పంగలూరు మండలంలో రూ.40 లక్షలతో నిర్మిస్తున్న కొండమూరు ఎస్సీ కమ్యూనిటీ హాలు, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న కొండమంజులూరు కమ్యూనిటీ హాలు, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పంగలూరు బీసీ యాదవ కాలనీ కమ్యూనిటీ హాలు, రూ.20 లక్షలతో నిర్మిస్తున్న తక్కెళ్లపాడు ఎస్సీ కమ్యూనిటీ హాలు, రూ.30 లక్షలతో నిర్మిస్తున్న బూధవాడ ఎస్సీ కమ్యూనిటీ హాలు, రూ.50 లక్షలతో నిర్మిస్తున్న అలవలపాడు ముస్లిం కమ్యూనిటీ హాలు నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. సంతమాగులూరు మండలంలో రూ.9.5 లక్షలతో నిర్మిస్తున్న ఏల్చూరు కమ్యూనిటీ హాలు, రూ.50 లక్షలతో నిర్మిస్తున్న కొమ్మాలపాడు కాపు కమ్యూనిటీ హాలు, రూ.30 లక్షలతో నిర్మిస్తున్న కామేపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాలు, రూ.50 లక్షలతో నిర్మిస్తున్న కుందుర్రు బీసీ కమ్యూనిటీ హాలు, రూ.30 లక్షలతో నిర్మిస్తున్న పరిటాలవారి పాలెం బీసీ కమ్యూనిటీ హాలుతో పాటు బల్లి కురవ మండంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న వైదన ముస్లిం కమ్యూనిటీ హాలు, రూ.30 లక్షలతో నిర్మిస్తున్న కొమ్మినేని వారి పాలెం ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు కొరిశపాడు మండలంలో రూ.20 లక్షలతో నిర్మాణం చేపట్టిన రావినూతల ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాలు, రూ.30 లక్షలతో నిర్మిస్తున్న ప్రాసంగులపాడు ఎస్సీ కమ్యూనిటీ హాలు, రూ.25 లక్షలతో నిర్మాణం చేపట్టిన ఎస్టీ కమ్యూనిటీ హాళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లి యువతకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంతో మంది ఒప్పందాలు చేసుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యువత ఇకపై ఉద్యోగాల కోసం తమిళనాడు, కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగాలు లభిస్తాయని ఆయన చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేసిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. భర్తలు చనిపోయిన వారి భార్యల వితంతు పెన్షన్లను కూడా నిలిపి వేసి అన్యాయం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒకేసారి లక్షన్నర మంది వితంతువులకు పెన్షన్లు అందజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా దాదాపు రూ.33 వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్న రాష్ట్రం, దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. అర్హులైన అందరికీ పెన్షన్లు అందజేస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు.
స్థానికుల విజ్ఞప్తి మేరకు టి.కొప్పెరపాడులో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఇప్పటికే రూ.4.50 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పిన ఆయన, అనంతరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. అదే విధంగా రెండు గుళ్లకు కూడా దూప, దీప నైవేధ్య పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మోటుపల్లి నుంచి కుంద వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిలో కలిపేందుకు కేంద్రానికి విజ్ఞప్తి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు అందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం బల్లికురవ మండల పరిధిలోని ముక్తేశ్వరం మేజర్ కాలువ పూడిక తీత పనులను మంత్రి పరిశీలించారు. చివరి ఎకరానికి కూడా సజావుగా నీరు పారేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
టీ కొట్టు వద్దే సమస్యల పరిష్కారం.
జే.పంగలూరు మండలం రామకూరు వద్ద ప్రజలతో కలసి టీ తాగిన మంత్రి గొట్టిపాటి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టికి తీసుకొచ్చిన గ్రీవెన్స్ కు సంబంధించి వెంటనే పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రామకూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన మహ్మద్ వలి కుటుంబ సభ్యులను కలిసి తన సానుభూతి తెలిపారు. ఇటీవల విద్యుత్ ప్రమాదంలో గాయపడిన అదే గ్రామానికి చెందిన దొడ్డక శ్రీను కుమారుడు చిన్నారి అభిరామ్ ను పరామర్శించారు. అదే విధంగా కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న మస్తాన్ రావుకు మంత్రి గొట్టిపాటి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


