అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు చెక్కులు పంపిణీ.
ఆదాయం రెట్టింపు, వారి సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
అన్నదాత సుఖీభవ - పిఎం కిసాన్ పథకం రెండో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండల కేంద్రంలో నియోజక వర్గ పరిధిలోని 36,808 మంది రైతులకు సంబంధించిన 24.72 కోట్ల రూపాయల మెగా చెక్కు ను మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎపి మారి టైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ లతో కలసి లబ్ధిదారులకు అందచేసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సాగు భూమి కలిగి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు, అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలు, పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6 వేల రూపాయలు వెరసి సంవత్సరానికి 20 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ రైతులను ఆదుకోవడం జరుగుచున్నదన్నారు.
అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగష్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మొదటి విడత కింద కేంద్ర , రాష్ట్ర నిధులు కలిపి రాష్ట్రంలోని మొత్తం 46,85,838 రైతుల ఖాతాల్లో 3174.43 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. ఈ రోజు రెండో విడత కింద 3135.01 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెండు విడతలు కలపి మొత్తం 6309 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో రెండో విడత 2.68 లక్షల మంది రైతులకు 180.36 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం రెండు విడతలు కలపి జిల్లాలో సుమారు 361 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు. కొండపి నియోజకవర్గ పరిధిలో రెండో విడత 36808 మంది రైతుల ఖాతాల్లో 24.72 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. మొత్తం రెండు విడతలు కలిపి కొండపి నియోజక వర్గం పరిధిలో 49 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మర్రిపూడి మండల పరిధిలో 7920 మంది రైతులకు రెండో విడత 5.30 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మండల పరిధిలో రెండు విడతలు కలపి మొత్తం 10.28 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వివరించారు. ఒక్క మర్రిపూడిలో రెండో విడత 1057 మంది రైతులకు 74 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ మండలానికి రెండు డ్రోన్స్ వంతున సబ్సిడీ తో రైతులకు అందచేయడం జరుగుచున్నదన్నారు. రానున్న రోజుల్లో రైతులకు ఎన్ని డ్రోన్స్ అవసరమైతే అన్ని సబ్సిడీ తో ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే సబ్సిడీ తో దాణా ఇవ్వడంతో పాటు గోకులం షెడ్స్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం కొండపి నియోజకవర్గం కాగా, ఈ నియోజకవర్గంలో మర్రిపూడి మండలం వెనుకబడిన మండలం అని, ఈ మర్రిపూడి మండల అభివృద్ధి కి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు మాట్లాడుతూ... రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. మన జిల్లాలో ప్రధానంగా కాలువలు, చెరువులు, వర్షం ఆధారిత వ్యవసాయం జరుగుతున్నట్లు తెలిపారు. సేద్యంలో టెక్నాలజీని వినియోగించుకోవాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమాసియా
దేశాలు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ మార్కెట్లో మంచి ధర ఉన్న పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఈ దిశగా టెక్నాలజీని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. భూముల రకాన్ని బట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా
రసాయనాల వినియోగము ఉండాలి తప్ప ఒకే ధోరణి సరికాదన్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దిశగానే రైతు సేవా కేంద్రాల పరిధిలో భూముల స్వభావము, వాటి సారాన్ని పరీక్షిస్తున్నట్లు చెప్పారు. స్థానిక పంటల ఉత్పత్తి, వాటికి అవసరమైన ఎరువుల సరఫరాతో పాటు పంటలకు తగిన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో 33 కంపెనీలు ప్రత్యేకంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా ప్రభుత్వం అందిస్తున్న సేవలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునేలా వారం రోజులు పాటు ' అన్నదాత - సుఖీభవ ' కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా రైతులకు అన్నివేళలా అధికారులు అండగా ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను వ్యవసాయ అవసరాలకే వినియోగించుకోవాలని సూచించారు. భౌగోళికంగా భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాలో వ్యవసాయంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఫ్లోరైడ్ నీటి సమస్యను పరిష్కరించడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరగా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూములు విస్తారంగా ఉండడము వలన పరిశ్రమలు స్థాపించేందుకు పలు కంపెనీలు కూడా వస్తున్నాయన్నారు. మర్రిపూడి మండలంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కరించేలా ఈ మండలంపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టరుకు చెప్తానని కలెక్టర్ తెలిపారు.
ఏపీ మారి టైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికినీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ కింద సంవత్సరానికి సుమారు 34 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు అన్నదాత సుఖీభవ పథకం- పి ఎం కిసాన్ పథకం కింద రెండో విడత లో సుమారు 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3135 కోట్ల రూపాయలు జమ చేస్తుండగా, కొండపి నియోజక వర్గంలో 36808 మంది రైతుల ఖాతాల్లో 24.72 కోట్ల రూపాయలు జమచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో కొండపి నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే మర్రిపూడి, టంగుటూరు రోడ్డు మరమ్మత్తులపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగిందని, త్వరలో ఈ రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కొండపి నియోజకవర్గం, ముఖ్యంగా ఈ మర్రిపూడి మండలం చాలా వెనుకబడిన ప్రాంతాలు, ఈ ప్రాంతంలో చిన్న కారు, సన్న కారు రైతులకు సంబంధించి రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. నియోజక వర్గం అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు.
ఇటీవల విశాఖపట్నం లో ముఖ్యమంత్రి సారథ్యంలో 16 లక్షల కోట్ల రూపాయల మేర వివిధ పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. మన ప్రాంతానికి కూడా సీబీజడ్ ప్లాంట్ రాబోతున్నట్లు తెలిపారు. మారిటైమ్ బోర్డు కు సంబంధించి 1 లక్షా 67 వేల కోట్ల రూపాయలతో 23 కంపెనీ లతో విశాఖపట్టణం సమ్మిట్ లో ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నట్లు తెలిపారు. తద్వారా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, కనిగిరి ఆర్ డి ఓ.కేశవర్ధన్ రెడ్డి, కొండపి నియోజకవర్గం ప్రత్యేక అధికారి శ్రీమతి కళావతి, నియోజక వర్గ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

