బడుగులేరు గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు.



 బడుగులేరు గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

 ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లోని బడుగులేరు గ్రామంలో పర్యటించి కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించటం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా కలెక్టర్.పి.రాజాబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా బహిరంగ మల విసర్జన ఎంతమాత్రమూ సరికాదని ఆయన చెప్పారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో గురువారం పర్యటించారు. ఈ గ్రామంలో ఇటీవల 9 మందికి కామెర్లు రావడంతో తాగునీరు, ఇతర పారిశుద్ధ్య నిర్వహణ పనులను వారు పరిశీలించారు. కామెర్ల నేపథ్యంలో గ్రామంలోని బోరు ద్వారా మంచినీటి సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలకు వివరించారు. అప్పటినుంచి ఆర్.వో. ప్లాంట్ ద్వారా మంచినీటిని సరఫరా చేయిస్తున్నట్లు చెప్పారు. మంచినీటికి వినియోగించిన బోరును కలెక్టర్ , ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు గృహాలను సందర్శించి స్థానికులతో వారు మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉన్నప్పటికీ మహిళలు మాత్రమే వినియోగిస్తున్నారని, పురుషులు ఎక్కువగా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలుసుకున్నారు. ఈ పరిస్థితి సరికాదని, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగించాలని వారు స్పష్టం చేశారు. పరిసరాల అపరిశుభ్రత, బహిరంగ మల విసర్జన ద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్ చెప్పారు. తమకు గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించాలని, ఇళ్ల స్థలాలు కావాలని ప్రజలు కోరగా... త్వరలోనే ఆ మేరకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

వంట మనిషిని తీసేయండి....

     గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను,  అదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శించారు. అంగనవాడి రికార్డులను పరిశీలించి, చిన్నారుల ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న ఆహారము, వయసుకు తగినట్లుగా బరువు, ఎత్తును స్వయంగా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సిబ్బందికి స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి వారు మధ్యాహ్న భోజనము తిన్నారు. అన్నం సరిగా ఉడకపోవడాన్ని 

వారు గమనించగా, విద్యార్థులకు కూడా అదే విషయమై ఫిర్యాదు చేయడంతో వంట మనిషిని తీసేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యక్తిగత శుభ్రత ఆవశ్యకత, బహిరంగ మలవిసర్జన వలన కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని టీచర్లను ఆదేశించారు. 

రూ.13 లక్షలతో మంచినీటి ట్యాంకు.

         అనంతరం నందన మారెళ్ళ గ్రామంలోని బాలకోటేశ్వరపురంలో రూ.13 లక్షలతో ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంకు నిర్మాణానికి కలెక్టర్, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్లో భాగంగా 20 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ట్యాంకును రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. తమ గ్రామానికి అంతర్గత సిమెంట్ రోడ్లు, ప్రాథమిక పాఠశాల కావాలని స్థానికులు కోరగా... త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

                  ఈ సందర్భంగా వారి వెంట డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డీఈవో కిరణ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, ఎంపీపీ దొంతులూరి ప్రకాశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, 

అధికారులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post