కంభం చెరువును సందర్శించిన కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తో కలసి శనివారం కంభం చెరువును సందర్శించి చెరువు అలుగు నుండి పారుతున్న వరద నీటి ఉధృతిని పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుగా జిల్లా కలెక్టర్, బేస్తవారిపేట సమీపంలోని హై వే కు అనుకుని ఉన్న చీతిరాల కత్వను సందర్శించి కంభం చెరువు నుండి వస్తున్న వరద ఉధృతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మీడియాతో మాట్లాడుతూ, భారీ వర్షాలు, తుఫాను వలన నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. వర్షాభావం ఉండే ప్రకాశం జిల్లాలో ఇటీవలి వర్షాల వలన కంభం చెరువు, గుండ్లకమ్మ రిజర్వాయర్ తో సహా ప్రధాన ఐదు రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండినట్లు చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో సమర్థంగా పనిచేయటం వలన ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్నారు. అయితే కొన్ని లోతట్టు ప్రాంతాలతో పాటు పంట పొలాలు కూడా నీట మునిగాయన్నారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
స్థానిక శాసనసభ్యునితో కలిసి క్షేత్రస్థాయి పరిస్థితిని తాను కూడా పరిశీలిస్తున్నానని, నియోజకవర్గంలో జరిగిన నష్టంపై అధికారులతో చర్చించి ఆ వివరాలను ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
శాసనసభ్యులు అశోక్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ, గిద్దలూరు నియోజకవర్గంలో పంటలతో పాటు రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని, ఇళ్ళు కూడా కూలాయని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తుఫాను సమయంలో అధికార యంత్రాంగం సమర్ధంగా పనిచేసేలా మార్గ నిర్దేశం చేసిందన్నారు.
తుఫాను అనంతరం బాధితులకు నష్టపరహారాన్ని ఇచ్చే విషయంలోనూ అంతే వేగంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. నష్టపోయిన వారికి పరిహారం త్వరగా వచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆసియాలోనే రెండో అతిపెద్దదైన కంభం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలోనే ఇక్కడ బోట్ పర్యాటకం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ శివరామి రెడ్డి, కంభం తాసిల్దార్ వి కిరణ్.వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

