ఫ్లోరైడ్ గ్రామాలను సందర్శించి స్వయంగా వివరాలను తెలుసుకున్న ప్రకాశం కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపల్లె, దిరిశవంచ గ్రామాలకు కూడా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్. పి.రాజాబాబు చెప్పారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఈ గ్రామాలలో స్థానిక శాసనసభ్యులు.ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి గురువారం ఆయన పర్యటించారు. ఫ్లోరోసిస్ వలన అనారోగ్యం పాలైన ప్రజలతో వారు మాట్లాడారు. ఆర్వో ప్లాంట్ ద్వారా వస్తున్న నీటిని త్రాగునీటిగా వినియోగించుకుంటున్నామని ప్రజలు చెప్పారు. అయితే అన్నం వండుకోవడానికి కూడా బోరు నీటినే
వినియోగిస్తున్నట్లు తెలుసుకున్న కలెక్టర్... పూర్తిస్థాయిలో తాగునీటి అవసరాలు తీర్చేలా ట్యాంకర్లతో మంచినీళ్లు సరఫరా చేస్తామన్నారు. ఈ దిశగా తక్షణమే చర్యలు తీసుకొని, శుక్రవారం నుంచి ట్యాంకర్లు సరఫరా చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రామతీర్థం నుంచి కూడా మంచినీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు ఆయన చెప్పారు. ఫ్లోరైడ్ తీవ్రతపై త్వరగా తనకు నివేదిక ఇవ్వాలని డిఎంహెచ్వో వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. కాగా, ఈ గ్రామంలో మురుగునీటి నిర్వహణ కోసం మ్యాజిక్ డ్రైనేజీలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇది తాగునీరు కాదు.
అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ ప్రాంగణంలోని బోరు నీటినే విద్యార్థులు తాగుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ నీటిని విద్యార్థులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సమీపంలోని ఆర్ఓ ప్లాంట్ ద్వారా విద్యార్థులకు మంచి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలోని బోరు నీటిని భోజనం ప్లేట్స్ కడుక్కోవడానికి, ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ' ఇది తాగునీరు కాదు ' ..
అని బోరు వద్ద బోర్డు పెట్టాలని ఆదేశించారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగటం వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు స్వయంగా కలెక్టర్, ఎమ్మెల్యే వివరించారు. విద్యార్థులు తాగుతున్న నీరు ఎంత ప్రమాదకరమో ప్రత్యక్షంగా వారి ముందే, తరగతి గదిలోనే అధికారులు నీటి పరీక్ష చేసి చూపించారు. అవసరమైతే ఇంటి వద్ద నుంచే మంచినీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఈ ప్రాంగణంలోని బోరు వాటర్ విద్యార్థులు తాగుతున్నట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డిపిఓ. వెంకటేశ్వరరావు, డీఈవో.కిరణ్ కుమార్, ఆర్డిఓ.కేశవర్ధన్ రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, ఎంపీపీ దొంతలూరి ప్రకాశం, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు ఉన్నారు,

