ప్రకాశం జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం.




 ప్రకాశం జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

  మొంథా తుఫాను వలన ప్రకాశం జిల్లాకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలమని కేంద్ర బృందం తెలిపింది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిస్తామని భరోసా ఇచ్చింది. ఈ తుఫాను వలన జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ 

శాఖల ఉన్నతాధికారులతో నియమించిన కమిటీ సోమవారం జిల్లాలో పర్యటించింది. 

శ్రీమతి పి.పౌసుమి బసు, మహేష్ కుమార్, శశాంక్ శేఖర్ రాయ్, సాయి భగీరథ్ లతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కూడా వచ్చారు. ముందుగా ఒంగోలు నగరంలోని ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ కు రాగా కలెక్టర్ శ్రీ. పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్,ఆర్. గోపాలకృష్ణ, డి ఆర్ ఓ.బి.చిన ఓబులేసు స్వాగతం పలికి ప్రకాశం భవనానికి తోడుకొని వచ్చారు. 

 ప్రకాశం జిల్లా అంతటా నష్టం.

జిల్లాలో ప్రధానంగా వ్యవసాయము - దాని అనుబంధ రంగాలు, రోడ్లు భవనాలు, ఇరిగేషన్ - ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పశుసంవర్ధక శాఖలతో పాటు ఒంగోలు నగరం పైనా ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నష్టాన్ని తెలిపేలా గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం వీక్షించింది. వీటికి సంబంధించిన వివరాలను స్వయంగా కలెక్టర్ పి,రాజబాబు వారికి వివరించారు. 

అనంతరం తుఫానుకు ముందు పరిస్థితి ఏ విధంగా ఉన్నదీ, తుఫాన్ సమయంలో ఎలాంటి 

 పరిస్థితి తలెత్తిందీ, తుఫాను తర్వాత పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీసుకున్న చర్యలను తెలియజేసేలా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను కూడా కేంద్ర బృందం వీక్షించింది. 

అన్ని విధాలుగా నష్టపోయారు..

ఈ తుఫాను వల్ల రైతులతోపాటు చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తున్నవారు కూడా తీవ్రంగా నష్టపోయినట్లు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ. షేక్ రియాజ్ కేంద్ర బృందానికి తెలిపారు. అల్లూరు, కొప్పోలు రొయ్యల చెరువులను కేంద్ర బృందం పరిశీలిస్తుండగా తుఫాన్ సమయంలో నెలకొన్న పరిస్థితి, వీటి సాగుదారులు నష్టపోయిన విధానాన్ని వారు వివరించారు. ఇందుకు 

సంబంధించిన వివరాలను బృందానికి అందజేశారు. ఇతర రంగాలపై చూపిన నష్ట ప్రభావాన్ని కూడా వారు వివరించారు. పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి బాధితులను ఆదుకునేలా అవసరమైన సహాయం అందించేలా చూడాలని కోరారు. 

మొత్తం కోల్పోయారుగా..

కేంద్ర బృందం అల్లూరులోని వరి పొలాలను సందర్శించింది. నీరు నిలిచిపోవడం వలన వేర్లతో సహా కుళ్లిపోయిందని రైతులు వాపోయారు. 

అంతా అనుకూలిచింటే సంక్రాంతి సమయానికి పంట చేతికొచ్చేదని, ఇప్పుడు పరిస్థితి తారు మారైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

వరి దిబ్బలను తెచ్చి చూపించగా... మొత్తం కోల్పోయారుగా అని కేంద్ర బృందం సభ్యులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం అల్లూరు చెరువును బృందం పరిశీలించింది. తుఫాను సమయంలో ఈ చెరువు కట్టకు గండి పడే పరిస్థితి తలెత్తగా, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తీరును వారు పరిశీలించారు. నీటి ఉధృతికి ఈ మార్గంలోని కల్వర్టు దెబ్బతినిన విధానాన్ని ఇంజనీరింగ్ అధికారులు ఈ సందర్భంగా వారికి వివరించారు. 

పత్తి పై అధిక ప్రభావం.

 నాగులుప్పలపాడు లో దెబ్బతిన్న పత్తి పంటను ప్రతినిధుల బృందం పరిశీలించింది. పంట పూర్తిగా దెబ్బతిందని, వేర్లకు ఫంగస్ వ్యాపించడం వలన పొలంలో మరో పంట వేసే అవకాశం కూడా ఈ సీజన్లో లేదని రైతులు తెలియజేశారు. 

ఈ సమయంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఈ బృందానికి వివరించారు. పశ్చిమ ప్రాంతంలో ఈ నష్టం అధికంగా ఉన్నట్లు తెలిపారు. పత్తి 8313, వరి 1557, సబ్జ 1388, మొక్కజొన్న 1260 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు చెప్పారు. వీటితోపాటు మినుములు 26, వేరుశనగ 17, కందులు 89 హెక్టార్లలో నష్టపోయినట్లు వివరించారు. మొత్తంగా వివిధ రకాల పంటలు జిల్లాలో 12570 హెక్టర్లలో దెబ్బతిన్నట్లు చెప్పారు. 

జిల్లాను ఆదుకోండి...

కేంద్ర బృందం గ్రీవెన్స్ హాలుకు వచ్చినప్పుడు సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, రాష్ట్ర వ్యవసాయం మిషన్ వైస్ చైర్మన్,ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా కలిసి జిల్లాకు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకునే చూడాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు.

Post a Comment

Previous Post Next Post