ఘనంగా శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రేమ, శాంతి, సేవకు ప్రతిరూపంగా శ్రీసత్య సాయిబాబా నిలిచారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ
శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకలు ఆదివారం కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు అధ్యక్షతన
జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఒంగోలు ఎంపీ .మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే .దామచర్ల జనార్ధన రావు, కనిగిరి ఎమ్మెల్యే . ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర మ్యారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్.
రామరాజు, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ . ఆర్. గోపాలకృష్ణ పాల్గొన్నారు. ముందుగా సత్య సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ సత్య సాయి బాబా మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని అన్నారు. విద్య, వైద్యం, మారుమూల ప్రాంతాలకు తాగునీటి సరఫరా వంటి సేవా కార్యక్రమాలకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. ఎంపీ మాట్లాడుతూ సత్యసాయితో గడిపిన సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. 40 ఏళ్ల క్రితమే సత్యసాయితో కలిసి కారులో ఆయన ఆశ్రమాన్ని చూసినట్లు చెప్పారు. దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ సత్య సాయి విశిష్ట వ్యక్తిత్వం ద్వారా ప్రపంచం మొత్తానికీ ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొన్నారు. సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారని, అందుకే ఆయన జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భక్తి, సేవాతత్వంతో ప్రజల గుండెల్లో సత్యసాయిబాబా చెరగని ముద్ర వేశారని కొనియాడారు. కేవలం బోధించడం మాత్రమే కాకుండా ఆచరణలో చూపటం ద్వారా శాంతియుత జీవనంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. మేయర్ మాట్లాడుతూ ఎవరికీ హాని చేయకుండా ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలనే సత్యసాయి మార్గం ఎల్లవేళలా ఎంతో విలువైనదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ, దేవదాయ శాఖ అధికారులు, సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ప్రిన్సిపాల్ అరుణ, సేవా ట్రస్ట్ అధ్యక్షులు శిద్దా సాయిబాబు, కోశాధికారి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ముందుగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి.

