స్వర్ణ ఏలూరు - స్వచ్ఛ ఏలూరు.



స్వర్ణ ఏలూరు - స్వచ్ఛ ఏలూరు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

        ఏలూరు, అక్టోబర్, 6 : ఏలూరు జిల్లాను 'స్వర్ణ ఏలూరు - స్వచ్ఛ ఏలూరు' గా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక సి.ఆర్.రెడ్డి కళాశాల ఆడిటోరియం లో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, వివిధ శాఖల అధికారులతో కలిసి అందించారు. ముందుగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంక్రాంతి లోగా జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల సాధన లక్ష్యాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అధికారులు, ప్రజలు కలిసికట్టుగా మనసు పెట్టి పనిచేస్తే 'స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో అన్ని విభాగాలలోనూ రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా అవార్డులు తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో 2, జిల్లా స్థాయిలో 51 స్వచ్ఛ అవార్డులు సాధించిందని, రానున్న స్వచ్ఛ అవార్డుల సమయానికి ప్రస్తుతం సాధించిన అవార్డులకు రెట్టింపు అవార్డులు సాధించేలా లక్ష్యాలను నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. జనవరి,1వ తేదీ నాటికి జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిస్థాయిలో నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతి నాటికి జిల్లాలో నూరుశాతం ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ చేయాలనీ, సేకరించిన తడి, పొడి చెత్తలను వేరుచేసి, తడిచెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చాలన్నారు. ప్రతీ ఇంటిలోనూ తడి చెత్తను హోమ్ కంపోస్ట్ గా మార్చి, మొక్కలకు ఎరువుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కలిగించాలని, పట్టణ ప్రాంతాలలో 3 వేల ఇళ్ళు , గ్రామీణ ప్రాంతాలలో 5 వేల ఇళ్లలో హోమ్ కంపోస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 50 వేల ఇళ్లలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుచేసుకునేలా చూడాలని, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధాల నిర్వహణ షెడ్లు ఏర్పాటుచేయాలని, ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని డంపింగ్ యార్డులో 80 వేల టన్నులకు పైగా ఉన్న వ్యర్ధాలను నిర్వహణ చేసి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటి నిర్వహణ కు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ-వ్యర్ధాలను ముందుగా పురపాలక సంఘాల స్థాయిలో సేకరించాలన్నారు. 

                 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ స్వచ్చంద్ర నిరంతర కార్యక్రమమని, సంపూర్ణ పారిశుద్ధ్యసాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలన్నారు. ప్రతీ వ్యక్తి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశుభ్రత ముందుగా మన ఇంటి నుండే ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామం, జిల్లా,రాష్ట్రం, దేశం సంపూర్ణ పారిశుద్ధ్యం గా మారుతుందన్నారు. పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతీ ఒక్కరూ నియంత్రించాలన్నారు. 

        ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏలూరు నగరపాలక సంస్థలో ఇంటింటికి వెళ్లి చెత్తసేకరణ చేస్తున్నామని, ప్రతీ ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్తసేకరణ వాహనాలకు అందించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతీ ఒక్కరూ నిషేదించాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ, డిఎంహెచ్ఓ డా. పి .జె. అమృతం, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, జిల్లా ప్రజారవాణాధికారి షబ్నమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post