జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందాల్సిందే-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏ వర్తకులైనా పాత జీఎస్టీ వసూలు చేస్తే రాష్ట్ర స్థాయిలో 8712631279, జిల్లా స్థాయిలో 8712631283 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు.
ఫిర్యాదులు నమోదుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్లు , హెల్ప్ డెస్క్- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, అక్టోబర్, 11 : జీఎస్టీ 2. O ప్రయోజనాలు ప్రజలందరికీ అందాల్సిందేనని, ఈ విషయంలో సహకరించని వర్తకులపై ప్రజలు చేసే ఫిర్యాదులను పరిగణనలోనికి తీసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పెద్దఎత్తున ప్రయోజనాలు కల్పించే ఉద్దేశ్యంతో జీఎస్టీ లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చాయని, జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందేలా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కానీ కొంతమంది వర్తకులు కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేయకుండా పాత జీఎస్టీ స్లాబ్ ల ప్రకారమే వసూలు చేస్తున్నారన్న ప్రజల అభిప్రాయాలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జీఎస్టీ ప్రయోజనాలకు సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించాడానికి, సందేహాలను నివృత్తి చేసేందుకు ఏలూరు జిల్లాలో 8712631283 ఫోన్ నెంబర్ తో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాక రాష్ట్ర స్థాయిలో కూడా జీఎస్టీ ఫిర్యాదుల నమోదుపై 8712631279 ఫోన్ నెంబర్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ లకు వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి, ఫిర్యాదులో అంశాలపై విచారణ చేసి సంబంధిత వర్తకులపై నిబంధలననుసరించి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రజలు తెలియజేసే సందేహాలను నివృత్తి చేయాలని వాణిజ్య శాఖ అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
