అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి!



 అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి!

భారీ వర్షాల దృష్ట్యా హోంమంత్రి  అనిత వీడియో కాన్ఫరెన్స్.

ప్రభావిత మండలాలలో పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారులను నియమించిన ప్రకాశం కలెక్టర్.

ప్రకాశం జిల్లాక్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

భారీ వర్షాల దృష్ట్యా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వి.అనిత ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ప్రకాశం భవనం నుంచి కలెక్టర్.పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్.ఆర్.గోపాలకృష్ణ, డీ.ఆర్.వో. బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. 

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా తక్షణమే స్పందించేలా యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. 

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు.

 తీరం వెంట ఉన్న వర్ష ప్రభావిత మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పారు. 

ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, ఆ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, అవసరమైన రేషన్ సరుకులను సమకూర్చటంపై ఈ ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

 వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను గుర్తించి పిల్లలకు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఈవో కిరణ్ కుమార్ కు చెప్పారు. 

సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున పర్యాటకులను అనుమతించకుండా గస్తీ పెంచాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. 

తాగునీరు కలుషితం కాకుండా, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో సిబ్బందిని మోహరించి పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ తెలియజేశారు . 

రోడ్లపై అడ్డంగా చెట్లు కూలినా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినాత్వరగాపునరుద్ధరించేలాగా అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని అన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post