స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.




 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. 

ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూ.ఆర్. కోడుతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. మంత్రితోపాటు కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ.దామచర్ల జనార్ధనరావు, జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్. గోపాలకృష్ణ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ.షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

          ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ సభ్యుల వివరాలు, వారు రేషన్ సరుకులు పొందే దుకాణ డీలర్ వివరాలతో ఏటీఎం కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ విధానాన్ని పటిష్టపరచి ఎం.డి.యు. వాహనాల స్థానంలో డీలర్ వ్యవస్థను పునరుద్ధరించి వృద్ధులు, వికలాంగుల ఇంటికే నేరుగా రేషన్ సరుకులను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఒంటరి మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు కూడా రేషన్ కార్డులను ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వ 16 నెలల కాలంలోనే జిల్లాలో 20వేలకు పైగా కొత్త రేషన్ కార్డును మంజూరు చేసినట్లు చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, సరుకులు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. నెలలో ఎప్పుడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు కూడా వీటిని గుర్తింపు కార్డులుగా వాడుకోవచ్చు అని మంత్రి చెప్పారు.        

 కలెక్టర్ మాట్లాడుతూ దుర్వినియోగాన్ని నివారించేలా సాంకేత పరిజ్ఞానంతో ఈ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్డు ద్వారా ఏ షాపులో, ఏ సమయంలో రేషన్ సరుకులు తీసుకున్నారో ట్రేస్ చేయవచ్చు అన్నారు. కార్డు పోయినా జిరాక్స్ కాపీతో కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. రేషన్ బియ్యాన్ని చులకనగా చూడవద్దని, మరిన్ని పోషకాలు ప్రజలకు అందేలా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని కలెక్టర్ వివరించారు. 

 ఒంగోలు శాసనసభ్యులు జనార్ధన్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం-2, స్త్రీశక్తి, ఆటో డ్రైవర్ల సేవలో వంటి కార్యక్రమాల ద్వారా ఆ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని, సమగ్ర వివరాలతో ఇదే మాదిరిగా స్మార్ట్ పాస్ బుక్కులు కూడా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. 

  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 6,51,818 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీరికి 1392 రేషన్ షాపుల ద్వారా సరుకులు అందిస్తామని తెలిపారు. కొత్తగా పెళ్లయిన వారు కూడా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేలా ఉమ్మడి కుటుంబం నుంచి డివైడ్ చేసి ఇచ్చేలా మే నెల నుంచే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. రేషన్ షాపులను కూడా వివిధ సరుకులు అందుబాటులో ఉండేలా స్థానిక అవుట్ లెట్లుగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి నెలలోనూ ఒకరోజును ఎన్ఫోర్స్మెంట్ డే గా నిర్వహిస్తున్నామన్నారు. దీపం-2 పథకంలో ఇప్పటివరకు 10 లక్షల మందికి 70 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. పాఠశాలలు,  హాస్టళ్లలోని విద్యార్థులకు భోజనం కోసం ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు వివరించారు. 

             రియాజ్ మాట్లాడుతూ వేలిముద్రల సమస్యలకు చెక్కు పెట్టేలా కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది అన్నారు. సంక్షేమంలో ఇది నూతన ఒరవడి అని ఆయన వ్యాఖ్యానించారు. 

 మేయర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదే క్రమంలో స్మార్ట్ కార్డులను ప్రవేశ పెట్టడం సంతోషకరమన్నారు.  

అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు వారు అందించారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని డిఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ఆర్. వెంకట్రావు, ఇతర అధికారులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post