అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయాలు – కలెక్టర్ విజయ్ కృష్ణన్.
జాతీయ ఏకతా దివస్ వరకు పోలీసు అమరుల వారోత్సవాలు – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, అక్టోబర్ 21: అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ
“పోలీసుల త్యాగాలు అపారమైనవి. ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి, నిరంతరం సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో నిస్వార్థంగా కష్టపడుతున్న పోలీసు సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. పోలీసు ఉద్యోగం కఠినమైనదైనా, సమర్పణతో కూడినదీ, ప్రజల భద్రత కోసం వారు చూపుతున్న అంకితభావం ప్రశంసనీయం. అమరులైన పోలీసు సిబ్బందిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి,” అని ఆమె తెలిపారు.
తదనంతరం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మాట్లాడుతూ –
“అక్టోబర్ 21, 1959న చైనా సరిహద్దు వద్ద దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల స్ఫూర్తితో ఈ దినాన్ని పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, అందులో 5 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు విధి నిర్వహణలో వీరమరణం పొందారు,” అని తెలిపారు.
“పోలీసు సేవ అనేది సవాళ్లతో కూడినది. ప్రతి పోలీసు అధికారి కొత్త పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, నిబద్ధత కలిగి ఉండాలి. చట్ట పరిరక్షణతో పాటు ప్రజల సేవ, దేశ సేవ మన ధ్యేయం కావాలి. సైబర్ నేరాలు, డిజిటల్ క్రైమ్స్ వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక అవగాహన అవసరం. ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పణకు వెనుకాడని వృత్తిగా పోలీసు సేవను గౌరవంగా భావించాలి,” అని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలీసు అమరుల స్మారక స్తూపం వద్ద స్మృతి పరేడ్, గౌరవ వందనం, పుష్ప గుచ్చాలు ఉంచడం ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు.
జిల్లా ఎస్పీ తెలిపారు:
“అమరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్‌లు, వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు నిర్వహించి, పోలీసు సేవల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాం,” అని అన్నారు.
అమరులైన పోలీసు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లాలో 1983 నుండి 2024 వరకు వీరమరణం పొందిన 27 మంది పోలీసు అమరవీరులు, అలాగే దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం వీరమరణం పొందిన 191 మంది పోలీసుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు చదివారు.
ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతుల మీదుగా 10 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు రూ.10,000/- చొప్పున నగదు చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, డీఎస్పీలు ఈ.శ్రీనివాసులు, ఎం.శ్రావణి, వి.విష్ణు స్వరూప్, పరిపాలనాధికారి సిహెచ్.తిలక్ బాబు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మి, రమేష్, పైడపు నాయుడు, వెంకటనారాయణ, అప్పలనాయుడు, ప్రేమ్ కుమార్, రామకృష్ణ, మన్మధరావు, రమణమూర్తి, సంజీవరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
