పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల బోధనా ఫీజులు, ఉపకారవేతనాల బకాయిలను సత్వరమే విడుదల చేయాలి -ఏ ఐ వై ఎఫ్.
15 నుండి చేపట్టనున్న ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల బంద్ కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు.
విద్యారంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం సిగ్గు చేటు.
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల చెవిలో పూలతో నిరసన.
కల్లూరు ధర్మేంద్ర,ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల ఇంటర్మీడియట్,డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ,బీఈడీ,ఫార్మా, పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల బోధన మరియు ఉపకారవేతన ఫీజు బకాయిలను సత్వరమే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 15వ తేదీ నుండి తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్(టీపీడీపీఎం ఏ) మరియు
ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (ఫతీ) వృత్తి విద్యా కళాశాలలు చేపట్టనున్న కళాశాలల బంద్ కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ప్రకటించారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి వై జంక్షన్ కూడలి వరకు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ* మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి, అమలు చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం,ఇప్పుడు అదే ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి పరచి, మేధో సంపత్తిని పెంచాల్సిన పాలకులు విస్మరిస్తున్నారని అన్నారు. విద్యార్థులను ఓట్లతో ముడిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేయాలని వారు కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యశాఖ మంత్రిగా ఉండి కూడా ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్నారే తప్ప, విద్యారంగ సమస్యలపై సమీక్ష చేయకపోవడం దుర్మార్గమన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారని వారు అన్నారు. బోధన రుసుములు, ఉపకార వేతనాల కోసం రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారని వారు అన్నారు. ఇప్పటికే కోర్సులు పూర్తి చేసిన, చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు కలిపి 2021-25 విద్యాసంవత్సరం నాటికే రూ.7000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.మరల ఇప్పుడు 2025-26 విద్యా సంవత్సరానికి 1000కోట్ల అదనపు ఫీజులు అవసరం పడుతుందన్నారు. ఫీజుల విడుదల్లో ఆలస్యం, సంక్షేమ శాఖలు విడుదల చేసిన బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అప్పులు చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఫీజు బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా కళాశాలలకు టోకెన్లు ఇస్తున్నా, ట్రెజరీ నుండి మాత్రం నిధులు మంజూరు కావడం లేదని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో నేతలు బోధన ఫీజుల బకాయిలను విడుదల చేస్తామని విద్యార్థుల పక్షాన ఉంటామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని ప్రస్తుతం విస్మరిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని వారు ఎద్దేవా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1400 ఇంటర్ కళాశాలల్లో 9లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 944 డిగ్రీ కళాశాలల్లో 6లక్షల మంది విద్యార్థులు, 262 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక లక్షా 20వేల మంది విద్యార్థులు, 200 పీజీ కళాశాలల్లో 20వేల మంది విద్యార్థులు ఉన్నారని వీరిలో ప్రధానంగా ఉపకార వేతనాల మీదే ఆధారపడి ఉన్నత విద్య అభ్యసిస్తున్నారన్నారు.కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అంటూ ప్రైవేట్ కళాశాలలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని విమర్శించారు.ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో వందలాది ప్రైవేట్ కళాశాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రధానంగా అధ్యాపకుల జీతభత్యాలు, కళాశాలల నిర్వహణ తదితర సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో విద్యా రంగ బలోపేతానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలల నిర్వహణ చేయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయని వారు స్పష్టంచేశారు.ఉన్నత విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దసరా పండగ లోపే విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, ఉపాధ్యక్షుడు కె. కళ్యాణ్,రాజ్ కుమార్, మహేష్, విశాల్, నితిన్,కార్తీక్, భరద్వాజ్, రాణా, నదీమ్, కిషోర్,ప్రభాకర్, సుధీర్ లతో పాటు 20మంది పాల్గొన్నారు.
