విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దు.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి.. - సిపిఎం ఆధ్వర్యంలో నిరసన.




విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దు.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి..
                - సిపిఎం ఆధ్వర్యంలో నిరసన.
 ఏలూరు సెప్టెంబర్ 9:
                    విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దని..పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.
 ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. శ్రీనివాస్, ఆర్.లింగరాజు, డి.ఎన్.వి.డి ప్రసాద్ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టిన చందంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారంపడేలా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్ మీటర్లు బిగించారని ఈ స్మార్ట్ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందన్నారు. పైగా ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, దొంగ చాటుగా ప్రజలు ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. బిగించిన స్మార్ట్ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఒకేసారి బిల్లుల భారం మోత మోగించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు అయ్యే ఖర్చు ప్రజలే భరించాలని, అదాని కంపెనీకి లాభాలు కట్టబెట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తున్నాయని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరలా ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్లు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, ఎస్.మహంకాళి రావు, తామా ముత్యాలమ్మ,నగర కార్యదర్శి పంపన రవికుమార్, నగర కమిటీ సభ్యులు వైయస్ కనకారావు, జె.గోపి, నాయకులు కె.లెనిన్, సిరి బత్తుల సీతారామయ్య, పలువురు సిపిఎం నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post