ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఆర్&బి మంత్రి జనార్దన్ రెడ్డి ని కలిసి రోడ్ల పరిస్థితులపై చర్చించారు.
అమరావతి, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో రాష్ట్ర రహదారులు, భవనాలు (ఆర్&బి) శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కలిశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితులను మంత్రికి వివరించి, రోడ్ల విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీమతి తంగిరాల సౌమ్య నియోజకవర్గ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా నందిగామ నుంచి పొక్కునూరు వరకు మరియు గండేపల్లి రోడ్ల విస్తరణ (వైడింగ్) పనులపై ప్రస్తావించారు. ఈ రోడ్లు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రజలకు సౌకర్యం కల్పించవచ్చని విన్నవించారు. అలాగే, నియోజకవర్గంలోని ఇతర రహదారుల మరమ్మతులు, నిర్వహణ వంటి అంశాలపై చర్చించడం జరిగినది.
మంత్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి విన్నపాలను సానుకూలంగా స్వీకరించి, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రవాణా సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
