రాష్ట్రంలో 6 గ్యాస్, పెట్రోల్ బ్లాకుల గుర్తింపు - ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
లోక్ సభలో ఏలూరు ఎంపీ ప్రశ్నకు కేంద్రం జవాబు.
దేశం మొత్తంలో 54, అందులో ఏపీలో 6 పెట్రోల్, గ్యాస్ బ్లాకులు.
182.7 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు గుర్తింపు.
ఏలూరు, ఆగస్టు 22: గత 5ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6 గ్యాస్, పెట్రోల్ బ్లాకులు గుర్తించినట్టు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా పెట్రోలు, గ్యాస్, హైడ్రోకార్బన్ సహజవనరుల అన్వేషణలో సాధించిన పురోగతిపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
చమురు, గ్యాస్ కోసం గత 5ఏళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 124 బ్లాకులలో అన్వేషణ చేపట్టగా, 54 బ్లాకులలో గ్యాస్, పెట్రోల్ నిల్వలను గుర్తించినట్లు, అందులో 6 బ్లాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించినట్లు మంత్రి తెలిపారు. 2020-21 నుండి 2024-25 మధ్య జరిగిన ఈ అన్వేషణ ద్వారా 182.7 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఆయా బ్లాకుల్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ చమురు, గ్యాస్ సహా హైడ్రోకార్బన్ అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయదనీ, వివిధ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు, కాంట్రాక్టర్లు వారి స్వంత ఖర్చుతోనే ఈ అన్వేషణ చేపడతారని మంత్రి స్పష్టం చేశారు.
గుర్తించిన బ్లాకులను చమురు వెలికితీసే సామర్థ్యమున్న కంపెనీలకు ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కేటాయిస్తారు. ఈ చమురు, గ్యాస్ ప్రాజెక్టుల అన్వేషణ మరియు ఉత్పత్తి (E&P) కార్యకలాపాలు భారీగా దిగుమతి చేసుకుంటున్న చమురు, సహజ వాయువుపై మన దేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి అని కేంద్ర మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిల్వలు గుర్తించారో వివరంగా తెలపాలంటూ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడగ్గాఅడగగా, రాష్ట్రంలో గోపవరంలో 2, కవిటం సౌత్, సౌత్ వేల్పూరు, సౌత్ మహాదేవపట్నం, ఎండపల్లిలో ఒక్కొక్కటి చొప్పున బ్లాకులలో చమురు, గ్యాస్ నిల్వలను గుర్తించినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.
