ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.
సైనూరు గ్రామంలో ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా అందజేత.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 6:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న "మీ భూమి – మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల భూ హక్కులకు సంపూర్ణ రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు భూ యాజమాన్యానికి చట్టబద్ధమైన ఆధారంగా నిలుస్తాయని, వీటి ద్వారా రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు, పంట నష్టపరిహారం వంటి సేవలను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.
గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించిన ఆమె, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

