ఒంగోలు లో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఆదివాసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఒంగోలు నగరంలోని గిరిజన భవనంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీమతి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి స్వామితోపాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు, ఇన్చార్జి డిఆర్ఓ శ్రీమతి మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముందుగా అల్లూరి సీతారామరాజు, ఇతర గిరిజన వీరుల చిత్రపటాలకు వీరు పుష్పాంజలి ఘటించారు.
ఈసందర్భంగా మంత్రిమాట్లాడుతూ
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమర్థంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్టీలకు కేటాయించిన నిధులే దీనికి నిదర్శనం అన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం కింద గిరిజనులకు 4.55 లక్షల ఎకరాలు కేటాయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4152 అత్యంత వెనుకబడిన గిరిజన ఆవాసాలకు ( పి.వి.టి.జీ.లు) 11 సంక్షేమ పథకాలను విస్తరింప చేశామన్నారు. గిరిజనుల విద్యకు ప్రత్యేక దృష్టి సారించి ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.198 కోట్లతో 74 గిరిజన పాఠశాలల్లో అదనపు భవనాలు నిర్మించామన్నారు. సికిల్ సెల్ ఎనీమియా బారినపడిన గిరిజనులకు నెలకు పదివేల రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తున్నామన్నారు. గత ఏడాది విశాఖలో యోగాసనాలు, ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా 13,000 మంది గిరిజనుల థింసా నృత్యాలు గిన్నిస్ రికార్డు సాధించాయన్నారు. గిరిజనుల అభివృద్ధికి, వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి పునరుద్ఘాటించారు.
ఒంగోలు శాసనసభ్యులు జనార్ధన్ మాట్లాడుతూ గిరిజనులకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. 2014-19 సమయంలో ఒంగోలులో రూ.1.35 కోట్లతో గిరిజన భవనాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ భవనంలో మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటానని చెప్పారు. నగరంలో గిరిజన బాలికలకు ప్రత్యేక హాస్టల్ కూడా నిర్మించేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గిరిజనులకు సముచిత అవకాశం కల్పిస్తామని జనార్దన్ చెప్పారు.
వెట్టిచాకిరి నుంచి ఇటీవల విముక్తి పొందిన 16 మందికి ఈ సందర్భంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కురిచేడు మండలం రామాంజనేయ కాలనీలో ఇళ్లు కాలిపోయిన మూడు కుటుంబాలకు కూడా సరుకులను ఇచ్చారు. వర్షాలకు ఇల్లు కారుతున్న 25 కుటుంబాలకు టార్పాలిన్ పట్టాలను ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు డాక్టర్ బాలాజీ నాయక్, గిరిజన సంఘాల నాయకులు పేరం సత్యం, పొట్లూరి లక్ష్మయ్య, సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ముందుగా గిరిజన విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


