ఉద్యోగాలు, విద్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం యువత ఉద్యమించాలి -AIYF.
అన్నోజీగూడలో ఏఐవైఎఫ్ మండల 3వ మహాసభ.
కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
దేశ యువత ఆశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ, విద్యా రంగంలో సమస్యలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. AIYF ఘట్‌కేసర్ మండల 3వ మహాసభ అన్నోజీగూడా లో జరిగింది, ఈ సమావేశం మండల కార్యదర్శి సంపంగి సదాశివ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర*. మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువతలో ఉపాధి, పరీక్షల పారదర్శకత, భవిష్యత్ అవకాశాలపై అసంతృప్తి పెరుగుతోందని, ఇటీవల విద్యార్థి–యువజన ఉద్యమాలు ఈ అసంతృప్తిని స్పష్టంగా ప్రతిబింబించాయని పేర్కొన్నారు. దేశంలో యువ నిరుద్యోగం ఇంకా ఆందోళనకర స్థాయిలో ఉందని, పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో సమర్థవంతమైన చర్యలు అవసరమని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని అన్నారు.
ఘట్‌కేసర్ మండలంలో స్థానిక ఉపాధి అవకాశాల కొరత, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల లేమి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల సమస్యలు, యువతకు క్రీడా మరియు సాంస్కృతిక వేదికల కొరత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయడం, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విద్యా–వైద్య రంగాలను బలోపేతం చేయడం, స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, యువతకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత అని డిమాండ్ చేశారు.
అదే విధంగా *ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి సల్మాన్ బేగ్, టి. సత్య ప్రసాద్*. మాట్లాడుతూ సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించే కీలక వేదికగా నిలుస్తాయని తెలిపారు. ఉద్యోగ హక్కు, విద్య, వైద్యం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, యువత భవిష్యత్తు వంటి అంశాలపై సమగ్ర తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ మహాసభలో సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఏఐవైఎఫ్ మండల కార్యవర్గ సభ్యులు సతీష్, యాదగిరి, ఆంజనేయులు, శ్రీను, సాయి పాస్వాన్, శివ, భరత్, మధు, అనీల్, ప్రదీప్, రెహ్మాన్, జాన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
