వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.


 వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపు పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు 

ఆగస్టు 22న నీటి విడుదల ట్రయల్ రన్ నేపథ్యంలో మార్కాపురం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం.

సహృద్భావ వాతావరణంలో, ఒత్తిడి లేకుండా సున్నితంగా తరలింపు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశం.

పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం.

మార్కాపురం,జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల తరలింపు ప్రక్రియను ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం ఈనెల 22వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ట్రయల్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో, ముంపు గ్రామాల ప్రజల పునరావాసం, మౌలిక వసతులు, ఇతర సమస్యలపై బుధవారం మార్కాపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిహారం అందిన నిర్వాసితులతో అధికారులు సామరస్యంగా చర్చించి, ఎటువంటి ఒత్తిడికి గురిచేయకుండా సున్నితంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరిహారం విషయంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ప్రత్యేక కమిటీల ద్వారా ప్రణాళికాబద్ధంగా తరలింపు

ముంపు ప్రాంతాలైన సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, గొట్టిపడియ, చింతల ముడిపి, కాటమరాజు తండా, లక్ష్మీపురం, కృష్ణానగర్, అక్కచెరువు గ్రామాల ప్రజలను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని, సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ వివరించారు.

పునరావాస కాలనీల్లో ప్రగతి నివేదికలు:

పునరావాస (ఆర్ &ఆర్ ) కాలనీలలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు రోజువారీగా 'ప్రోగ్రెస్ రిపోర్ట్' అందజేయాలని ఆదేశించారు. కాలనీల్లో త్రాగునీరు, విద్యుత్, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు తేల్చి చెప్పారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఈఈ సురేష్ బాబు, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్, డ్వామా పీడీ సువార్త, ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి బాలాజీ నాయక్, డిఇఓ సుబ్బారావు, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post