అర్హులైన ప్రతీ ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, ఆగష్టు, 28; జిల్లాలో అర్హులైన ప్రతీ ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మత్స్య శాఖాధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, సంక్షేమ పధకాలు, వివిధ రాయితీల అమలుపై అధికారులతో కలెక్టర్ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఏపి అప్పడా మరియు కోస్టల్ ఆక్ట్ ప్రకారం 13 వేల 508 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వాటిలో 9730 విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ యూనిట్ ను రూ.1.50 లకే సబ్సిడీ పై అందిస్తున్నామని, మిగిలిన 3778 విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం జారీ చేసిన 57 వ నెంబర్ జి.ఓ. ననుసరించి నిబంధనల మేరకు విద్యుత్ సబ్సిడీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతీ ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ పధకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతీ ఆక్వా రైతుకు అవగాహన కలిగించి, ఆయా పధకాలను వారు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
