విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందాలి: వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 8: విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందితేనే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులు, సమర్థ నాయకులు రూపుదిద్దుకుంటారని ఏపీటీపీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు అన్నారు.
పలాసలోని మదర్ థెరీసా హైస్కూల్‌లో నిర్వహించిన విద్యార్థి నాయకుల ఎన్నికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం ద్వారా పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.
సాధారణ ఎన్నికలను తలపించే విధంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా రహస్య ఓటింగ్ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు విలువ, ఎన్నికల నిర్వహణ విధానం, ప్రజాస్వామ్య స్ఫూర్తిపై అవగాహన కల్పించడం విశేషమన్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ఎన్నికల పూర్తి ప్రక్రియను విద్యార్థులకు పరిచయం చేశారని తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడంలో దోహదపడతాయని బాబూరావు పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థి నాయకులు తోటి విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
ఈ ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు పోలింగ్ సిబ్బందిగా బాధ్యతలు నిర్వర్తించగా, పాఠశాల ప్రిన్సిపాల్ వజ్జ గంగాభవాని రిటర్నింగ్ అధికారిణిగా వ్యవహరించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం ముగింపులో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులను వజ్జ బాబూరావు అభినందించారు.

